Reading Time: < 1 minute

న్యూఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి, సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

‘వందేమాతరానికి 150 ఏళ్లు’ అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి అశోకచక్ర పురస్కారాన్ని ప్రధానం చేశారు. అనంతరం నాలుగు ఎంఐ-17 హెలికాప్టర్లు కర్తవ్యపథ్‌పై పూలవర్షం కురిపించాయి. జెండా ఆవిష్కరణ అనంతరం సైనిక, రక్షణ దళాల కవాతు ఆకట్టుకుంది.

పరేడ్‌లో ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందాలు పాల్గొనగా, యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. 16 యుద్ధ విమానాలు, 9 హెలికాప్టర్లు, కార్గో విమానాలు, రాఫేల్, సుఖోయ్, మిగ్-29, జాగ్వార్ విమానాలు పాల్గొన్నాయి. అర్జున్, వజ్రాంగ్, వరుణ, విజయ్ వంటి ఫార్మేషన్ల దళాలు విన్యాసాలు ప్రదర్శించాయి.

‘ఆపరేషన్ సిందూర్’ ఆయుధ వ్యవస్థను త్రివిధ దళాలు ప్రదర్శించగా, వివిధ విభాగాలకు చెందిన మొత్తం 30 శకటాలు పరేడ్‌లో భాగమయ్యాయి. ఇందులో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు, కేంద్రమంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు చెందిన 13 శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.