class="wp-singular post-template-default single single-post postid-520 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

నిద్ర అనేది శరీరానికి అత్యంత అవసరమైన విశ్రాంతి. నిద్ర సమయంలో శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటూ, మెదడుకు విశ్రాంతిని అందిస్తుంది. అయితే నేటి జీవనశైలిలో చాలా మంది రాత్రి నిద్ర పట్టకపోవడం, మధ్యలోనే నిద్ర చెదిరిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి నిద్ర కోసం సరైన నిద్ర భంగిమను ఎంచుకోవడం చాలా కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం, నిద్రించేటప్పుడు ఒక వైపు తిరిగి పడుకోవడం ఉత్తమం. ఇది మనస్సును రిలాక్స్‌గా ఉంచి, లోతైన నిద్రకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు.

ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభంగా ఉండటంతో పాటు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకూ ఈ భంగిమ సురక్షితమైనదిగా వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ భంగిమలో పడుకోవడం వల్ల జీర్ణాశయంలో యాసిడ్స్ సరైన దిశలో పనిచేసి, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

అయితే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి కుడి వైపు తిరిగి పడుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇలా పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, గుండెపోటు వచ్చే ప్రమాదం కొంతవరకు తగ్గుతుందని వివరించారు.

అలాగే వెన్నెముక సమస్యలు ఉన్నవారికి కూడా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా, సరైన నిద్ర భంగిమను అలవాటు చేసుకోవడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడడంతో పాటు, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు అంటున్నారు.