class="wp-singular post-template-default single single-post postid-485 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

కొత్తగూడెం:
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని, పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా చర్యలు చేపడుతున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు.

శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 232 మంది లబ్ధిదారులకు సుమారు రూ.2.32 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే దఫాలో ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాల సమయంలో తల్లిదండ్రులు అప్పుల పాలవకుండా ప్రభుత్వం అందిస్తున్న రూ.1,00,116 ఆర్థిక సాయం కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒక్క రోజులోనే ఐదు మండలాలకు చెందిన ప్రజలకు ఈ స్థాయిలో నిధులు విడుదల కావడం నియోజకవర్గ చరిత్రలో ఒక రికార్డుగా నిలుస్తుందని కూనంనేని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, తహసీల్దార్లు పుల్లయ్య, శిరీష, కృష్ణ, కృష్ణప్రసాద్, సిపిఐ నాయకులు సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, యూసుఫ్, తోట రాజు, మాచర్ల శ్రీనివాస్, పొదిలి శ్రీనివాస్, మూడు గణేష్ తదితరులు పాల్గొన్నారు.