class="wp-singular post-template-default single single-post postid-1002 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

మధ్యప్రదేశ్‌లో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్తను హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేసిన ఘటన సింగ్రౌలి జిల్లాలో వెలుగుచూసింది. ఈ హత్యలో మృతుడి భార్య, ఆమె ప్రియుడు, మరో యువకుడు కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 8న డయల్ 112కు రజనియా కట్రా గ్రామం సమీపంలోని అడవిలో రోడ్డుకి పక్కన ఒక యువకుడి శవం బైక్ కింద ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మృతుడు ఖంతరా గ్రామానికి చెందిన అజయ్ వైశ్య (24)గా గుర్తించారు.

మృతదేహంపై గాయాల గుర్తులు ఉండటంతో పాటు బైక్‌ను ప్రమాదంలా కనిపించేలా ఉంచినట్లు పోలీసులు గమనించారు. దీంతో ఇది సాధారణ ప్రమాదం కాదని అనుమానం వ్యక్తమైంది. ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పెళ్లి తర్వాత బయటపడిన ప్రేమ వ్యవహారం

దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఉమా వైశ్యను పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది. ఆమెకు పెళ్లికి ముందే అమర్ బహాదూర్ వైశ్యతో ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఫిబ్రవరి 12న అజయ్‌తో వివాహం జరిగినట్లు వెల్లడించింది. అయితే పెళ్లి తర్వాత కూడా తన ప్రియుడితోనే ఉండాలని భావించి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు ఒప్పుకుంది.

పథకం ప్రకారం హత్య

ప్లాన్ ప్రకారం మార్చి 7న ఉమా తన భర్త అజయ్‌ను తన పుట్టింటికి రావాలని పిలిచింది. అతను బయలుదేరిన విషయాన్ని ప్రియుడు అమర్ బహాదూర్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో అమర్ బహాదూర్ తన సహచరుడు చంద్రప్రతాప్ అలియాస్ చందన్ వైశ్యతో కలిసి బొలెరో వాహనంలో అజయ్‌ను వెంబడించారు.

రాత్రి సమయంలో రజనియా కట్రా అడవిలో అజయ్ బైక్‌ను ఆపి, మెడికల్ గ్లోవ్స్ ధరించి గమ్ఛాతో అతని గొంతు నులిమి, రాయితో తలపై పలుమార్లు దాడి చేశారు. దీంతో అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదంలా చూపించే ప్రయత్నం

హత్య అనంతరం ఘటనను ప్రమాదంలా చూపించేందుకు మృతదేహం దగ్గర బైక్‌ను ఉంచి అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు సేకరించిన ఆధారాలు, విచారణలో నిందితుల పాత్ర బయటపడింది.

ఈ కేసులో భార్య ఉమా వైశ్య, ఆమె ప్రియుడు అమర్ బహాదూర్ వైశ్య, మరో యువకుడు చంద్రప్రతాప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన బొలెరో వాహనం సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా జైలుకు తరలించారు.

Disclaimer : ఈ వార్త పోలీసుల దర్యాప్తు ఆధారంగా అందించబడింది. కేసు విచారణ కొనసాగుతున్నందున తదుపరి వివరాలు మారే అవకాశం ఉంది.