class="wp-singular post-template-default single single-post postid-579 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

తెలంగాణలో టైఫాయిడ్ జ్వరం జనాల ప్రాణాలపైకి వస్తోంది. కలుషిత తాగునీరు, ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్న కల్తీ ఫుడ్ కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలవుతుండగా, మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా టైఫాయిడ్‌తో చనిపోతున్న వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు తెలంగాణ వాసులే కావడం కలకలం రేపుతోంది.

2023లో దేశవ్యాప్తంగా టైఫాయిడ్, పారా టైఫాయిడ్ కారణంగా 1,075 మంది మృతి చెందగా, అందులో 202 మంది తెలంగాణకు చెందినవారే కావడం గమనార్హం. ఈ విషయాలను తాజాగా Registrar General of India విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది.

దేశంలో రెండో స్థానం.. యూపీ తర్వాత తెలంగాణ నే… జనాభా పరంగా తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ, టైఫాయిడ్ మరణాల్లో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 2023లో అత్యధికంగా 377 టైఫాయిడ్ మరణాలు నమోదై మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 202 మరణాలతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. పంజాబ్‌లో 118 మంది, ఢిల్లీలో 36 మంది టైఫాయిడ్ కారణంగా మృతి చెందారు.

దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.5 శాతం మాత్రమే అయినప్పటికీ, టైఫాయిడ్ మరణాల్లో రాష్ట్ర వాటా 19 శాతానికి చేరుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నమోదవుతున్న మొత్తం టైఫాయిడ్ కేసుల్లో దాదాపు ఐదో వంతు తెలంగాణలోనే నమోదు అవుతున్నాయి.

స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం, మురికివాడల్లో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్ల పక్కన దుమ్ము ధూళిలో అమ్మే పానీపూరి, బజ్జీలు, ఇతర జంక్ ఫుడ్ తినడం వల్లే టైఫాయిడ్ వ్యాప్తి పెరుగుతోందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ముఖ్యంగా వర్షాకాలంలో వరద నీరు డ్రైనేజీ నీటితో కలిసిపోవడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరిస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలు, స్లమ్ ఏరియాల్లో ఈ సమస్య మరింత తీవ్రమైందని చెబుతున్నారు.

సొంత వైద్యం ప్రమాదమే

జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాంతకంగా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారం, పది రోజులైనా జ్వరం తగ్గకపోయినా అశ్రద్ధ చేస్తే టైఫాయిడ్ బ్యాక్టీరియా ముదిరి పేగులకు రంధ్రాలు పడటం, ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడం వంటి సీరియస్ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

వారం కంటే ఎక్కువగా జ్వరం కొనసాగడం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.
చివరి దశలో ఆసుపత్రికి చేరితే నోటి ద్వారా వేసుకునే మందులు పనిచేయక, హైడోస్ సెలైన్ ట్రీట్మెంట్ అవసరం అవుతుందని, అప్పటికే అవయవాలు దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.