class="wp-singular post-template-default single single-post postid-738 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటి భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన 23,865 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 26 అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.

రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్వహించే e-Detailed Accident Report (e-DAR) పోర్టల్‌లో 2022 నవంబర్ 14 నుంచి ఈవీలకు సంబంధించిన ప్రత్యేక సమాచారం నమోదు అవుతోంది.

గణాంకాల ప్రకారం 2023లో 5,594 ఈవీలు ప్రమాదాలకు గురికాగా, 8 వాహనాల్లో మంటలు చెలరేగాయి. 2024లో 7,817 ప్రమాదాల్లో 9 అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి. 2025లో 10,454 ప్రమాదాలు చోటుచేసుకోగా, 9 వాహనాలు దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలపై లోతైన అధ్యయనం కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. డీఆర్‌డీఓ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ వంటి సంస్థల నిపుణులు ఇందులో భాగమయ్యారు. వారి సిఫార్సుల మేరకు 2022 సెప్టెంబర్ 28న కొత్త సాంకేతిక నిబంధనలు జారీ చేసి, ట్రాక్షన్ బ్యాటరీలపై కఠిన భద్రతా ప్రమాణాలను అమలు చేశారు.

అయితే ఈవీల తయారీ లేదా వినియోగంపై నిషేధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ, పెట్రోల్-డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించడం, భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపింది.