class="wp-singular post-template-default single single-post postid-433 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

ఇటీవలి వరకు ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులపై దమనకాండ ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని బెదిరించారు.

అయితే ఒక్కసారిగా ట్రంప్ స్వరం మారింది. తాజాగా ఇరాన్‌కు బహిరంగంగా “ధన్యవాదాలు” చెబుతూ వ్యాఖ్యలు చేయడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. వందలాది నిరసనకారుల మరణశిక్షలను వాయిదా వేయడాన్ని స్వాగతిస్తూ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ స్పందించారు.

రేపు జరగాల్సిన 800కు పైగా ఉరిశిక్షలను రద్దు చేసినందుకు ఇరాన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సౌదీ అరేబియా, ఖతార్ వంటి మిత్రదేశాల దౌత్య ప్రయత్నాల వల్లే ట్రంప్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.

ఇరాన్‌పై దాడి జరిగితే గల్ఫ్ ప్రాంతమంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని ఆ దేశాలు అమెరికాను హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ చివరి నుంచి పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.

భద్రతా బలగాల కాల్పుల్లో వేలాది మంది మరణించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో దౌత్యమే చివరకు పరిష్కారంగా నిలిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.