class="wp-singular post-template-default single single-post postid-498 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా “తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025” కు పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం G.O. Rt.No.103ను విడుదల చేసింది. జనవరి 24, 2026న స్పెషల్ సెక్రటరీ సిహెచ్. ప్రియాంక జారీ చేసిన ఈ ఉత్తర్వులతో మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత పెరగడంతో పాటు క్షేత్రస్థాయి జర్నలిస్టులకు లబ్ధి చేకూరనుంది.

కొత్త నిబంధనల్లో అత్యంత కీలకంగా మహిళా రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారు. ఇకపై మీడియా యాజమాన్యాలు డెస్క్ జర్నలిస్టుల నియామకంలో 33 శాతం సీట్లను మహిళలకు తప్పనిసరిగా కేటాయించాలి. అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మండల స్థాయిలో పనిచేసే జర్నలిస్టుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో, 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు అదనంగా ఒక అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయనున్నారు.

పెద్ద, మధ్యస్థ పత్రికల కోసం ప్రత్యేక విభాగాల్లో కార్డుల సంఖ్యను పెంచారు. పెద్ద పత్రికలకు (2.5 లక్షలకు పైగా సర్క్యులేషన్) స్పోర్ట్స్, కల్చర్, ఫిలిం విభాగాల్లో ఒక్కొక్కదానికి ఒక అదనపు కార్డు ఇవ్వనున్నారు. మధ్యస్థ పత్రికలకు (75,001–2.5 లక్షల సర్క్యులేషన్) ఈ విభాగాల్లో ఏదో ఒకదానికి అదనంగా ఒక కార్డు మంజూరు చేస్తారు.

అలాగే రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (SMAC)ను బలోపేతం చేస్తూ కొత్త సభ్యులను చేర్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధితో పాటు పెద్ద దినపత్రికల నుంచి ఒక డెస్క్ జర్నలిస్ట్ ప్రతినిధికి చోటు కల్పించారు.

ఇకపై ఇప్పటివరకు వాడుతున్న “మీడియా కార్డు” పదం స్థానంలో అధికారికంగా “అక్రిడిటేషన్ కార్డు” అనే పదాన్ని ఉపయోగించనున్నారు. అలాగే నిబంధనల్లోని “ఉర్దూ బిగ్ న్యూస్‌పేపర్” స్థానంలో “ఉర్దూ డైలీ న్యూస్‌పేపర్” అనే పదాన్ని చేర్చారు. ఈ సవరణలపై జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.