class="wp-singular post-template-default single single-post postid-244 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

అయోధ్యలోని రామ మందిరం సముదాయంలో త్వరలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బంగారం, వజ్రాలు, పచ్చలు తదితర విలువైన రత్నాలతో పొదిగిన కర్ణాటక శైలి శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయానికి ఏర్పాటు చేయనున్నారు.

ఈ విగ్రహం సుమారు 5 క్వింటాళ్ల బరువు కలిగి, 10 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో రూపొందించబడింది. కర్ణాటకకు చెందిన ఓ అనామక భక్తుడు దీన్ని విరాళంగా అందించగా, దీని అంచనా వ్యయం రూ.25–30 కోట్లుగా చెబుతున్నారు. దక్షిణ భారత చేతిపనుల నైపుణ్యంతో రూపొందిన ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డా. అనిల్ మిశ్రా మాట్లాడుతూ, విగ్రహాన్ని పంపిన వ్యక్తి వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదని తెలిపారు. ప్రస్తుతం స్వామి విశ్వ ప్రసన్న తీర్థ పేరే తెలిసిందని పేర్కొన్నారు.

ఈ విగ్రహాన్ని రామాలయ సముదాయంలోని గోస్వామి తులసీదాస్ ఆలయానికి సమీపంలోని అంగద్ తిలా వద్ద ప్రతిష్టించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉడిపి స్వామి రాక అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు.

నివేదికల ప్రకారం, కర్ణాటక నుంచి 1,750 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక వ్యాన్‌లో 5–6 రోజుల్లో ఈ విగ్రహాన్ని అయోధ్యకు తీసుకొచ్చారు. ప్రతిష్టకు ముందు ఆవిష్కరణ, అనంతరం పవిత్రోత్సవం నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా సాధువులు, మహంతులు ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇదే సమయంలో, రామ మందిరం రెండో వార్షికోత్సవ వేడుకలు 2025 డిసెంబర్ 27 నుంచి 2026 జనవరి 2 వరకు జరగనున్నాయి.