class="wp-singular post-template-default single single-post postid-668 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

కొత్తగూడెం డివిజన్‌కు చెందిన జామయిల్ తోటల హార్వెస్టింగ్ పనుల్లో భారీ లంచం డిమాండ్ చేసిన కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రీ శ్రావణిను విశాఖపట్నంలో అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.

ఫిర్యాదుదారునికి లభించిన టెండర్‌కు సంబంధించి యూనిట్ నంబర్లు 8 నుంచి 15 వరకు మొత్తం 32,000 టన్నుల యూకలిప్టస్ చెట్ల నరికివేత పనులకు గాను ఒక్కో టన్నుకు రూ.90 చొప్పున మొత్తం రూ.28,80,000 లంచంగా డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ఇందులో భాగంగా పెనుగడప గ్రామ శివారులోని 9వ యూనిట్‌కు సంబంధించిన 3,900 టన్నుల యూకలిప్టస్ చెట్ల నరికివేత పనుల భవిష్యత్ బిల్లుల ఆమోదం కోసం టన్నుకు రూ.90 చొప్పున మొత్తం రూ.3,51,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో, ప్లాంట్ మేనేజర్ రాజేందర్‌తో పాటు అతనికి సహకరించిన గోపాలకృష్ణ (సీతయ్యగూడెం నివాసి)లను ఏసీబీ అధికారులు గత నెల 03-01-2026న రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో అప్పటి నుంచి పరారీలో ఉన్న డివిజనల్ మేనేజర్ తాటి శ్రీ శ్రావణి నమ్మదగిన సమాచారం మేరకు విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని ఈరోజు అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.