class="wp-singular post-template-default single single-post postid-482 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

కొత్తగూడెం:
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటన సందర్భంగా, ఇల్లందు గెస్ట్ హౌస్‌లో కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కంపెనీ మనుగడతో పాటు కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన మెమోరాండాన్ని మంత్రికి అందజేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడిన కూనంనేని, సింగరేణి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు పెనగడప, పూనుకుడుచెలక, రాంపూర్, గుండాల ప్రాంతాల్లో తక్షణమే కొత్త భూగర్భ బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.

సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు రూ.30 లక్షల వరకు వడ్డీ లేని గృహ రుణాలు మంజూరు చేయాలని, పదవీ విరమణ చేసిన కార్మికులకు కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకుండా ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అలాగే పాత సింగరేణి క్వార్టర్లను కూల్చివేయకుండా, ప్రస్తుతం నివసిస్తున్న మాజీ కార్మికులకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

కార్మికుల కార్పొరేట్ మెడికల్ బోర్డును ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరంగా కొనసాగించాలని కూడా కోరారు. సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తూ, కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కూనంనేని స్పష్టం చేశారు. ఈ అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని మంత్రికి విన్నవించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, నాయకులు నెరేళ్ల రమేష్, పి. సత్యనారాయణ చారి, బీజేపీ నాయకులు జీవీకే మనోహర్, రంగా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.