class="wp-singular post-template-default single single-post postid-637 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 1 minute

సినీ రంగుల ప్రపంచంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. చెన్నై కేంద్రంగా కొనసాగుతున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను తమిళనాడు పోలీసుల యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఛేదించింది. ఈ కేసులో మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన నటి అంజు కృష్ణతో పాటు తమిళ సినీ కో-డైరెక్టర్ విన్సీ నివేత సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చ మొదలైంది.

చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిఘా పెంచారు. నేషపాక్కం ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, వెంకటేష్ కుమార్ డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం బయటపడింది. దీంతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వలసరావాక్కం ప్రాంతానికి డ్రగ్స్ డెలివరీ కోసం కారులో వచ్చిన వెంకటేష్ కుమార్‌ను పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఆ కారులో నటి అంజు కృష్ణ, విన్సీ నివేత కూడా ఉండటంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ దాడుల్లో పోలీసులు 6 గ్రాముల మెతాంఫేటమైన్, 7 గ్రాముల OG గంజాయి, 15 గ్రాముల సాధారణ గంజాయి, LSD స్టాంపులు, స్మోకింగ్ బాంగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే తొమ్మిది మొబైల్ ఫోన్లు, ఒక కారును కూడా సీజ్ చేశారు.

కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన అంజు కృష్ణ మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి మలయాళ, తమిళ చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జోజు జార్జ్ నటించిన ‘ఆరో’ చిత్రంతో మంచి పేరు సంపాదించింది. ‘సుమేష్ అండ్ రమేష్’, ‘ఆకాశం కడన్’ వంటి సినిమాలతో పాటు ‘ప్రియంకరి’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.

అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం డ్రగ్స్ మాఫియాతో వారి సంబంధాలపై పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సినీ రంగంలో ఇలాంటి ఘటనలు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.