class="wp-singular post-template-default single single-post postid-647 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

తేదీ : 06-02-2026

జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సూచించారు.

శుక్రవారం పాల్వంచలోని అనుబోస్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నియమితులైన పోలింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ పోలింగ్ అధికారులు (ఏపీఓలు)కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో జరిగే చిన్నపాటి తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించారు. అందువల్ల ప్రతి పోలింగ్ అధికారి పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు, అలాగే ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.

ఓటింగ్ సామగ్రి నిర్వహణ, పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం అత్యంత కీలకమని పేర్కొన్న ఆమె, ఎన్నికల కోడ్‌ను కఠినంగా పాటించాలని, ఎలాంటి అక్రమాలు లేదా అవకతవకలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

శిక్షణ కార్యక్రమంలో వివరించిన అంశాలను పూర్తిగా అవగాహన చేసుకుని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ అధికారులు వ్యక్తం చేసిన సందేహాలను జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ సవివరంగా నివృత్తి చేసి, ఎన్నికల నిర్వహణపై స్పష్టత కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.