class="wp-singular post-template-default single single-post postid-565 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించాలంటే ఇక్కడి చట్టాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ, వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం గట్టి హెచ్చరిక జారీ చేసింది.

వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. భారతీయుల డేటాకు సంబంధించిన ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించము” అంటూ మెటాను తీవ్రంగా మందలించారు. భారత చట్టాలను పాటించకపోతే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని కూడా స్పష్టం చేశారు.

ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీతో సమానమని పేర్కొన్నారు. దేశంలోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు వాట్సాప్ ప్రైవసీ పాలసీని అర్థం చేసుకునే పరిస్థితి ఉందా అని మెటా ప్రతినిధులను కోర్టు సూటిగా ప్రశ్నించింది.

కొన్ని సందర్భాల్లో ఈ పాలసీలు న్యాయమూర్తులకే అర్థం కావడం కష్టమని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సాప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపిన తర్వాత, ఆ మందులకు సంబంధించిన ప్రకటనలే తన ఫోన్‌లో కనిపించాయని ఉదాహరణగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు.

ఇక ఇటీవల మెటా ఇంజినీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ సందేశాలను చదవగలదంటూ, వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.