Reading Time: 2 minutes

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. పాలనలో సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచే సేవలు పొందేలా చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సేవల ద్వారా ఇన్‌కమ్, రెసిడెన్షియల్, కులం వంటి ధృవీకరణ సర్టిఫికేట్లతో పాటు ఆర్టీసీ టికెట్లు, దేవాలయ దర్శనాలు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

విభిన్న వెబ్‌సైట్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట లభించేలా ఈ వాట్సప్ గవర్నెన్స్ వ్యవస్థను రూపొందించారు. దీనిని ఎలా ఉపయోగించాలో గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రజలు 9552300009 నంబర్‌కు వాట్సప్‌లో Hi అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవలను ప్రారంభించవచ్చు.

మున్సిపల్ శాఖ నుంచి 25 కొత్త ఆన్‌లైన్ సేవలు

ఇక తాజాగా Andhra Pradesh Municipal Administration పరిధిలోని Commissioner & Director of Municipal Administration (CDMA) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మొత్తం 25 మున్సిపల్ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.

ఈ పోర్టల్ ద్వారా

మ్యారేజ్ సర్టిఫికేట్
ఆస్తి పన్ను చెల్లింపులు
ట్రేడ్ లైసెన్స్
మ్యూటేషన్

ఇలా మొత్తం 25 రకాల సేవలను ఇంటి నుంచే సులువుగా పొందవచ్చు.

సర్టిఫికేట్లకు గడువు ఖరారు

సర్టిఫికేట్ల జారీలో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం స్పష్టమైన టైమ్ లైన్‌ను కూడా నిర్ణయించింది.

మ్యారేజ్ సర్టిఫికేట్ – 3 రోజుల్లో
ట్రేడ్ లైసెన్స్ – 7 రోజుల్లో
ఇంటి పన్ను సంబంధిత సేవలు – 15 రోజుల్లో

ఈ గడువు ముగిసినా సర్టిఫికేట్ జారీ కాకపోతే కారణాలు తప్పనిసరిగా తెలపాలి. దరఖాస్తు రిజెక్ట్ చేసినా స్పష్టమైన రీజన్ ఇవ్వాల్సి ఉంటుంది.
గడువులోగా దరఖాస్తులు క్లియర్ చేయకపోతే అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దీంతో దరఖాస్తులు, సర్టిఫికేట్ల జారీలో పారదర్శకత, వేగం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. త్వరలో మరిన్ని సేవలను కూడా ఈ పోర్టల్‌లో చేర్చనున్నట్లు సమాచారం.

ఆన్‌లైన్‌లో సేవలు ఎలా పొందాలి..?

cdma.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

‘Finger Tips’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

Online Services ఎంపికను సెలక్ట్ చేయండి

మీకు కావాల్సిన సేవను ఎంచుకోండి

నగరం / పట్టణాన్ని సెలక్ట్ చేయండి

అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి

దరఖాస్తు మున్సిపల్ కమిషనర్ లాగిన్‌కు వెళ్తుంది

అధికారులు పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేస్తారు.