Reading Time: < 1 minute

సంక్రాంతి పండుగకు ఏపీ ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. పండగకు సొంతూళ్లకు వెళ్లాలని భావించిన ప్రయాణికులకు ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె ముప్పుగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన అద్దె బస్సుల యజమానులు జనవరి 12 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు జనవరి 8న ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమల్లో ఉన్న స్త్రీశక్తి పథకం వల్ల నిర్వహణ ఖర్చులు పెరిగాయని, ఒక్కో బస్సుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా చెల్లించాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశంపై ఆర్టీసీతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. బుధవారం ఒక్కో బస్సుకు రూ.5,200 చొప్పున చెల్లిస్తామని ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేయడంతో యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమతో సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమ్మెకు సిద్ధమయ్యారు.

సమ్మె జరిగితే ఏపీ వ్యాప్తంగా 2,419 అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ వంటి సేవలు నిలిచే అవకాశం ఉండటంతో సంక్రాంతి ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడనుంది.