Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం పర్యాటకులకు ప్రతిబింబించేలా ఆకర్షణీయంగా రూపొందించిన ట్రైబల్ మ్యూజియాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ప్రశంసనీయంగా అభివృద్ధి చేశారని న్యూఢిల్లీ ఐకార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బోర్డు సభ్యుడు డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు.

శనివారం ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న ట్రైబల్ మ్యూజియాన్ని డాక్టర్ భాస్కర్ నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అంతకుముందు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం మ్యూజియానికి చేరుకుని అక్కడ ప్రదర్శించిన గిరిజనుల కళాఖండాలు, జీవన విధానాలను క్లుప్తంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి న్యూఢిల్లీ నుంచి తనను పరిశీలకుడిగా నియమించారని తెలిపారు. ఆ క్రమంలో భద్రాచలంలో దర్శనీయ స్థలాల గురించి తెలుసుకుంటే ఐటీడీఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియం ఉందని తెలిసి సందర్శించానన్నారు. మ్యూజియంలో గిరిజనుల జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలు, పురాతన కాలానికి చెందిన పనిముట్లు, కళాఖండాలు ఎంతో చక్కగా ప్రదర్శించారని ప్రశంసించారు.

అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలు నేటి యువతకు, చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చరిత్ర వివరాలతో పాటు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ప్రతి అంశాన్ని మ్యూజియం నిర్వాహకులు సందర్శకులకు స్పష్టంగా వివరించడం ద్వారా పర్యాటకులకు పూర్తి స్థాయి అవగాహన కలుగుతోందని అన్నారు.

ప్రాచీన గిరిజన సంస్కృతి, వారి వారసత్వాన్ని పరిరక్షిస్తూ, గిరిజనులు ఉపయోగించిన పనిముట్లు, పరికరాలు, జీవన విధానానికి సంబంధించిన వస్తువులు భవిష్యత్ తరాలకు తెలియజేసేలా మ్యూజియాన్ని అభివృద్ధి చేయడం ఐటీడీఏ అధికారులు తీసుకున్న గొప్ప చొరవగా డాక్టర్ భాస్కర్ నాయక్ అభిప్రాయపడ్డారు. గిరిజనులు గతంలో జీవించిన విధానాన్ని తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైబల్ మ్యూజియం నిర్వాహకులు వీరాస్వామి, మాధవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.