Reading Time: < 1 minute

భాగ్యనగరంలో ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లను కేంద్రంగా చేసుకుని సాగుతున్న భారీ పన్ను ఎగవేతను ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెలికితీశారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన సాధారణ తనిఖీలు దేశవ్యాప్తంగా విస్తరించి, సుమారు రూ.70,000 కోట్ల మేర టర్నోవర్‌ను లెక్కల్లో చూపకుండా దాచిపెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా అనలిటిక్స్‌ను వినియోగించి 60 టెరాబైట్ల డేటాను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కు చెందిన 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీల లావాదేవీలను ఆరు ఆర్థిక సంవత్సరాల (2019-20 నుంచి 2025-26 వరకు) కాలానికి పరిశీలించగా విస్తృత అవకతవకలు బయటపడ్డాయి.

హోటల్ నిర్వాహకులు నగదు లావాదేవీలను టార్గెట్ చేసి, కస్టమర్లకు బిల్లు ఇచ్చిన తర్వాత ఆ రికార్డులను సాఫ్ట్‌వేర్ నుంచి పూర్తిగా తొలగించడం లేదా మొత్తం తగ్గించి నమోదు చేయడం చేస్తున్నట్లు తేలింది. కొన్ని చోట్ల రోజుల, నెలల అమ్మకాల డేటాను బల్క్‌గా డిలీట్ చేసినట్లు ఆధారాలు లభించాయి. రూ.2,784 బిల్లును రూ.27గా మార్చిన ఘటనలూ బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా రూ.13,317 కోట్ల విలువైన బిల్లులు నేరుగా తొలగించబడగా, మొత్తం ఎగ్గొట్టిన టర్నోవర్ రూ.70,000 కోట్లకు చేరిందని అంచనా.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు రూ.5,141 కోట్ల అమ్మకాలు లెక్కల్లో చూపలేదని దర్యాప్తు చెబుతోంది. తెలంగాణలోనే రూ.1,500 కోట్ల బిల్లులు తొలగించినట్లు గుర్తించారు. కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, తర్వాత తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. సీబీడీటీ ఈ దర్యాప్తును దేశవ్యాప్తంగా విస్తరించి, సంబంధితులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.