Reading Time: < 1 minute

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఉదయం, రాత్రి వేళలే కాకుండా మధ్యాహ్నం సమయంలో కూడా చలి వణికిస్తోంది. దీంతో ప్రజలు స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించి చలికి తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాబోయే నెలల్లో మరింతగా చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలిపింది. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యల్పంగా నిలిచింది. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

వచ్చే రెండు రోజులు చలి మరింత తీవ్రంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.