Reading Time: < 1 minute

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షల దిశగా ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్సుకు 5,267 డాలర్లను దాటింది.

గత ఎనిమిది నెలలుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతుండటం గమనార్హం. యుద్ధం మరింత కాలం కొనసాగితే భారత్‌లో తులం ధర రూ.1.80 లక్షల ఆల్‌టైమ్ రికార్డును తాకే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల భారీ బంగారం కొనుగోళ్లు, డాలర్ బలహీనత వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. వచ్చే 12–18 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 6,000 డాలర్లకు చేరితే దేశీయంగా తులం రూ.2 లక్షలకు చేరువ కావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దుబాయ్ మార్కెట్‌లో కూడా ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ముడి చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం తీవ్రం కావచ్చు. ఇది పరోక్షంగా బంగారం ధరలను సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Disclaimer : ఈ వార్త మార్కెట్ విశ్లేషణ ఆధారంగా రూపొందించబడింది. బంగారం లేదా ఇతర పెట్టుబడుల విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.