Reading Time: 2 minutes

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 26, సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో బంగారం ధర ఒక్కసారిగా ఔన్సుకు 5,000 డాలర్ల మైలురాయిని దాటి చరిత్ర సృష్టించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణంగా మారాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 1.79 శాతం పెరిగి 5,071.96 డాలర్ల వద్ద ఇంట్రాడేలో ట్రేడవుతుండగా, ఒక దశలో 5,085.50 డాలర్ల గరిష్టాన్ని తాకింది. ఇక వెండి ధరలు మరింత దూకుడుగా సాగుతూ 4.57 శాతం పెరిగి ఔన్సుకు 107.65 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

భారత మార్కెట్‌లో రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం MCXకి సెలవు ఉన్నప్పటికీ, గత వారం ముగిసే సమయానికి బంగారం ధర 10 గ్రాములకు రూ.1,59,226, వెండి ధర కిలోకు రూ.3 లక్షల మార్కును దాటి రికార్డులు నెలకొల్పాయి.

గణాంకాలను పరిశీలిస్తే, 2025లో బంగారం ధరలు దాదాపు 64 శాతం పెరగగా, 2026 ప్రారంభం నుంచే ఇప్పటికే 17 శాతం లాభపడినట్లు తెలుస్తోంది. ఈ ర్యాలీకి కారణాలుగా

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత,

చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం,

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs)లో భారీగా పెట్టుబడులు రావడం
ప్రధానంగా పేర్కొంటున్నారు.

గోల్డ్, సిల్వర్ భవిష్యత్తు ఎలా?

రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి ధరల ర్యాలీ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో ట్రేడ్ టారిఫ్స్‌పై జరగనున్న విచారణ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి.

ఇక భారత్‌లో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్‌లో దిగుమతి సుంకాలపై తీసుకునే నిర్ణయాలు దేశీయంగా బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించనున్నాయి. ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, అది కొనుగోలుకు మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.