Reading Time: 2 minutes

గత కొన్ని నెలలుగా సన్నగిల్లిన భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వైపు అడుగులు పడటం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అధిక సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా వాటిని తగ్గిస్తున్నట్లు ప్రకటించడం భారత్‌కు ఊరట కలిగించే అంశంగా మారింది.

ట్రంప్ ప్రకటన మేరకు ఇప్పటివరకు భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలు ఇకపై 18 శాతానికి తగ్గనున్నాయి. అలాగే రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి విధించిన అదనపు 25 శాతం సుంకాలను కూడా ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా అతి తక్కువ పన్నులు విధించే దేశాల జాబితాలో భారత్ చేరినట్లు అవుతోంది.

ఈ పరిణామానికి పది రోజుల క్రితం భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ జీడీపీలో 25 శాతం, వాణిజ్యంలో మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించే ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, అమెరికా సుంకాల ప్రభావం భారత్‌పై గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో కెనడాతో యురేనియం ఒప్పందం, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య చర్చలు కూడా ట్రంప్‌ను పునరాలోచనకు నెట్టినట్లు తెలుస్తోంది.

అయితే తాజా ఒప్పందం పూర్తిగా భారత్‌కు అనుకూలమని చెప్పలేమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అమెరికా దిగుమతులపై భారత్ సుంకాలు విధించకూడదన్న షరతుకు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించడం, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంటే, వ్యవసాయం, ఇంధనం, టెక్నాలజీ వంటి రంగాల్లో దేశీయ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దౌత్యపరంగా అమెరికాను చర్చల టేబుల్‌కు తీసుకురావడం భారత్ విజయం అయితే, తమ ఉత్పత్తులకు సుంకాల మినహాయింపు సాధించుకోవడం అమెరికా సాధించిన విజయంగా ఈ ఒప్పందాన్ని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.