తమిళనాడులో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన మానవత్వానికే మచ్చగా మారింది. బీమా డబ్బుల కోసం ఇద్దరు కొడుకులు తమ సొంత తండ్రిని పాముకాటుతో హత్య చేసిన విషయం దర్యాప్తులో బయటపడింది. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లాలోని పొత్తతుర్‌పేట్టై గ్రామంలో వెలుగుచూసింది. ఈపీ గణేశన్ (56) ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు.
గత అక్టోబర్‌లో గణేశన్ తన ఇంట్లో అకస్మాత్తుగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇది పాముకాటు కారణంగా జరిగిందని చెప్పడంతో పోలీసులు మొదట సహజ మరణంగానే కేసు నమోదు చేశారు. అయితే ఆయన పేరిట భారీ మొత్తంలో జీవిత బీమా పాలసీలు ఉండటం, వాటిని కొడుకులు వెంటనే క్లెయిమ్ చేయడం అనుమానాలకు దారితీసింది. గణేశన్ ఆర్థిక స్థితికి మించిన విలువైన పాలసీలు ఉండటంతో బీమా కంపెనీలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే కొడుకులు ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. మొదట ఒక నాగుపాముతో కాటు వేయించినా తండ్రి ప్రాణాలతో బయటపడటంతో, వారం రోజుల తర్వాత మరింత విషపూరితమైన కట్ల పాముతో రెండోసారి దాడి చేశారు. ఈసారి గణేశన్ మృతి చెందాడు. అనుమానం రాకుండా పామును కూడా చంపేశారు.
ఈ కేసులో ఇద్దరు కొడుకులతో పాటు వారికి సహకరించిన నలుగురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. బీమా కోసం తండ్రినే చంపిన ఈ ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది.
