Reading Time: < 1 minute

అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యానికి బలైన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ నగర యంత్రాంగం అంగీకరించింది.

కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి 2021లో అమెరికా వెళ్లి నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోంది. 2023 జనవరి 23న సియాటెల్‌లో రోడ్డు దాటుతుండగా పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. వాహనాన్ని నడిపిన పోలీసు అధికారి కెవిన్ డవే వేగ పరిమితి 40 కిమీ ఉండగా 119 కిమీ వేగంతో వెళ్తున్నట్లు విచారణలో తేలింది. ప్రమాదం తర్వాత ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు బాడీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. భారత్, అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి.

భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం విచారణ వేగవంతమై, బాధ్యుడైన అధికారిని విధుల నుంచి తొలగించారు. జాహ్నవి కుటుంబం న్యాయపోరాటం ప్రారంభించగా, కోర్టు విచారణకు ముందే భారీ పరిహారం చెల్లిస్తూ రాజీకి సియాటెల్ యంత్రాంగం ముందుకొచ్చింది. గత వారం దాఖలైన ఒప్పందం బుధవారం ఖరారై, రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు అంగీకారం లభించింది.