Reading Time: < 1 minute

సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కోర్టులను ఆశ్రయిస్తారు. అయితే తీర్పులు చెప్పే న్యాయమూర్తులపైనే ఆరోపణలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్నపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక సమాచారం వెల్లడించింది. 2016 నుంచి 2025 వరకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కార్యాలయానికి, సిట్టింగ్ జడ్జిలపై మొత్తం 8,360 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. డీఎంకే ఎంపీ వి.ఎస్. అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకారం, సుప్రీంకోర్టు నుంచి అందిన డేటా ఆధారంగా ఈ సంఖ్యను వెల్లడించారు. అయితే ఈ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల రికార్డులు ఎందుకు లేవన్న ప్రశ్నకూ సమాధానం రాలేదు.

జడ్జిలపై అవినీతి, లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన ప్రత్యేక డేటాబేస్ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫిర్యాదులను విచారించే అధికారం కేవలం సీజేఐ లేదా ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకే ఉందని తెలిపింది. ప్రభుత్వం ఫిర్యాదులను సంబంధిత కోర్టులకు పంపడం తప్ప నేరుగా జోక్యం చేసుకోదని వెల్లడించింది. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ‘ఇన్-హౌస్ ప్రొసీజర్’ అమల్లో ఉందని పేర్కొంది.