Reading Time: < 1 minute

ముంబైలో చోటుచేసుకున్న ఓ అత్యంత ఘోరమైన నేర ఘటన పోలీసులనే షాక్‌కు గురిచేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన 25 ఏళ్ల మహిళ, తనతో ఏడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై అమానుషంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ముంబై శాంతాక్రూజ్ ప్రాంతానికి చెందిన ఈ మహిళకు 42 ఏళ్ల వివాహితుడితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా అక్రమ సంబంధంగా మారింది. అతను తన భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ఆమె తరచూ ఒత్తిడి చేసేది. అయితే బాధితుడు మాత్రం తన కుటుంబాన్ని వదిలేందుకు నిరాకరించాడు.

ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రతరం కావడంతో కొంతకాలం క్రితం ఆ మహిళ బీహార్‌లోని తన స్వగ్రామానికి వెళ్లింది. అక్కడి నుంచే ఫోన్ ద్వారా అతడిని బెదిరిస్తూ ఉండేది. డిసెంబర్ 19న తిరిగి ముంబైకి వచ్చిన ఆమె, డిసెంబర్ 24న అతడిని కలిసి విషయం సర్దుబాటు చేసుకోవాలని అతను ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

జనవరి 1వ తేదీ తెల్లవారుజామున న్యూ ఇయర్ వేడుకల పేరుతో అతడిని ఇంటికి పిలిచింది. గదిలో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో మళ్లీ పెళ్లి విషయమై గొడవ జరిగింది. అతను వెళ్లిపోవాలని ప్రయత్నించగానే ఆమె పదునైన ఆయుధంతో అతని మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు బయటికి తప్పించుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు.

ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దాడి అనంతరం ఆ మహిళ పిల్లలతో కలిసి పరారయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు.