Reading Time: < 1 minute

ముంబైలో చోటు చేసుకున్న ఒక అమానుష ఘటన కలకలం రేపుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న 20 ఏళ్ల యువతి పలు మార్లు లైంగిక దాడికి గురై గర్భవతిగా మారిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 16 మంది అనుమానితుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.

ఫోరెన్సిక్ నివేదికలు అందిన అనంతరం, యువతిని గర్భవతిని చేసిన వ్యక్తి ఆమె తండ్రేనని నిర్ధారణ కావడం షాక్‌కు గురిచేసింది. డీఎన్‌ఏ పరీక్షల్లో తండ్రి నమూనానే పూర్తిగా సరిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నివేదిక ఆధారంగా నిందితుడైన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత యువతి గత కొన్ని నెలలుగా పలుమార్లు లైంగిక దాడికి గురైనట్లు కౌన్సెలింగ్ సమయంలో వెల్లడించింది. వైద్య పరీక్షల్లో ఆమె సుమారు ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీనితో కేసును మరింత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు.

ఈ కేసులో ఇంకా లోతైన విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రారంభ దర్యాప్తులో మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులు, వైద్యులు, న్యాయ అధికారుల వాంగ్మూలాలు సేకరిస్తూ, ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.