Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట గ్రామ సమీపంలో చెత్త తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామానికి ఆనుకుని మున్సిపల్ అధికారులు చెత్తను కుమ్మరించడం, సాయంత్రం వేళల్లో ఆ చెత్తకు నిప్పు పెట్టడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విషపూరిత పొగతో గ్రామమంతా కమ్ముకుపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోందని, చిన్నపిల్లలు, వృద్ధులు దగ్గు, శ్వాసకోస సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. దుర్వాసనతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని వాపోయారు.

ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో, శనివారం ఆగ్రహించిన గ్రామస్తులు చెత్త తరలిస్తున్న మున్సిపల్ ట్రాక్టర్లు, వాహనాలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు గ్రామ సమీపంలో చెత్త వేయడం ఆపాలని డిమాండ్ చేస్తూ చెత్త బండ్లను ముట్టడించారు.