Reading Time: < 1 minute

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఖుస్ఖేడ–కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనమయ్యారు.

ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 25 మంది పని చేస్తున్నట్లు సమాచారం. ఉదయం 9:22 గంటల ప్రాంతంలో ప్రారంభమైన మంటలు నిమిషాల్లోనే మొత్తం భవనాన్ని ఆవరించాయి.

లోపల నిల్వ ఉంచిన రసాయనాలు మంటలను మరింత తీవ్రతరం చేయడంతో నల్లటి దట్టమైన పొగ కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే 10కి పైగా ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. మరికొందరు లోపల చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.