Reading Time: < 1 minute

ఇటీవల బ్యాంకింగ్ రంగంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింకులు, నకిలీ యాప్స్ వంటి పద్ధతుల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకులు భద్రతా చర్యలు పెంచుతూ, కస్టమర్లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. ఇదే క్రమంలో సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్లు, సైబర్ ఇన్సూరెన్స్‌లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఇవి తీసుకోవడం వల్ల సైబర్ మోసాల బారిన పడినప్పుడు కొంతవరకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది.

సైబర్ నేరాల వల్ల నష్టపోతున్న బ్యాంకింగ్ వినియోగదారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ మోసాల బారిన పడిన ఖాతాదారులకు రూ.25 వేల వరకు పరిహారం అందించేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోంది. బ్యాంకుల నిర్లక్ష్యం లేదా సిస్టమ్ లోపాల కారణంగా మోసం జరిగితే ఈ పరిహారం వర్తించనుంది. చిన్న మొత్తాల నష్టాలకు మాత్రమే ఇది అందుబాటులో ఉండనుందని, భారీ నష్టాలకు వర్తించదని సమాచారం.

ఇదే సమయంలో ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్ పెట్టేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే బ్యాంకింగ్ వినియోగదారులకు మరింత రక్షణ, ప్రయోజనాలు లభించనున్నాయి.