తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్య రక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్‌ను అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో 15 ఏళ్ల వయస్సు గల దాదాపు నాలుగు లక్షల మంది బాలికలను లక్ష్యంగా పెట్టుకుని ఈ టీకా కార్యక్రమాన్ని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందించబడుతుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ప్లానింగ్ సర్వే నిర్వహిస్తూ, ఆ వయస్సు గల బాలికలు పాఠశాలల్లో ఎంతమంది ఉన్నారు, చదువు మానేసిన వారు ఎంతమంది ఉన్నారు వంటి వివరాలను సేకరిస్తున్నారు. హెచ్‌పీవీ వైరస్ కారణంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత లక్షణాలు బయటపడే అవకాశం ఉంది.
చిన్న వయస్సులో వివాహం, అనేక ప్రసవాలు, శుభ్రత లోపం వంటి కారణాలు ప్రమాదాన్ని పెంచుతాయి. బయట ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతుంది. మొత్తం మూడు డోసులు అవసరం. ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందించనుంది. కార్యక్రమం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేస్తోంది.
