Reading Time: < 1 minute

తలనొప్పి సాధారణ సమస్యగా కనిపించినప్పటికీ, అది కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా తల వెనుక భాగంలో నిరంతరం నొప్పి ఉంటే అధిక రక్తపోటు కారణమై ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైగ్రేన్, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి కారణాలతో తలనొప్పి వస్తుంది. అయితే ఎప్పుడూ ఒకే ప్రాంతంలో, ముఖ్యంగా తల వెనుక భాగంలో నొప్పి కొనసాగితే జాగ్రత్త అవసరం.

ఢిల్లీ రాజీవ్ గాంధీ హాస్పిటల్‌కు చెందిన కార్డియాలజీ నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఒకటి లేదా రెండు సార్లు బీపీ పెరగడం వల్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ రక్తపోటు 180/120 mmHg కంటే ఎక్కువగా పెరిగితే అది వైద్య అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. ఈ స్థాయిలో బీపీ పెరిగినప్పుడు మెదడులోని రక్తనాళాలపై అధిక ఒత్తిడి ఏర్పడి తల వెనుక భాగంలో భారంగా నొప్పి వస్తుంది.

ఇలాంటి సందర్భాల్లో అస్పష్టమైన చూపు, తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. కొన్నిసార్లు స్వల్ప బీపీ పెరుగుదల కూడా తలనొప్పికి దారి తీస్తుంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తల వెనుక భాగంలో తరచుగా నొప్పి ఉంటే వెంటనే రక్తపోటు పరీక్ష చేయించుకుని వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరం.