Reading Time: < 1 minute

అమెరికాను తీవ్ర మంచు తుఫాన్‌ కుదిపేస్తోంది. న్యూయార్క్‌ నుంచి మసాచుసెట్స్‌ వరకు అనేక రాష్ట్రాలు మంచు దుప్పటిలో కూరుకుపోయాయి. ముఖ్యంగా న్యూయార్క్ నగరం పూర్తిగా స్తంభించింది. రోడ్లు, ఇళ్లు, దుకాణాలు, పార్కులు, మైదానాలు—ఎక్కడ చూసినా భారీగా మంచు పేరుకుపోయింది. న్యూజెర్సీలోని మౌంట్ హోలీ ప్రాంతంలో సుమారు 20 అంగుళాల మేర మంచు కురిసినట్లు సమాచారం. ఫిబ్రవరి నెలలో ఇంత భారీగా మంచు పడటం అరుదని స్థానికులు చెబుతున్నారు.

తుఫాన్ ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లక్షలాది కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టొచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విమాన రవాణాపై కూడా తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 10 వేల విమాన సర్వీసులు రద్దుకావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

టేనస్సీ, మిస్సిస్సిప్పి, టెక్సాస్, లూసియానా, కెంటుకీ, జార్జియా, వర్జీనియా, అలబామా వంటి రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల కొరత నెలకొంది. పరిస్థితి దృష్ట్యా 20 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. వీధుల్లో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.