Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | 06-02-2026

చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో, వద్దిపేట–పూసుగుప్ప గ్రామాల మధ్య నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం పరిశీలించారు. నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు త్వరితగతిన ప్రయోజనం చేకూరేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా ఎస్పీ దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచాలని, సైబర్ నేరాల పట్ల నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ సేవల్లో క్రమశిక్షణ, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై గణేష్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.