భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ మరియు తాజా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తున్నాయి. గత దశాబ్దంగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
యూకే, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా సహా 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భారత ఎగుమతుల్లో 99 శాతం వస్తువులపై సుంకాలు తగ్గాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తులు మరింత పోటీ సామర్థ్యాన్ని సాధించాయి. ఆస్ట్రేలియా, యూఏఈలతో వాణిజ్యం ఇప్పటికే రెట్టింపు కావడం గమనార్హం.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను గ్లోబల్ సరఫరా గొలుసులో భాగస్వాములుగా మార్చేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాలను సులభతరం చేయడంతో పాటు ‘జీరో డిఫెక్ట్–జీరో ఎఫెక్ట్’ విధానంతో నాణ్యత ప్రమాణాలు పెంపొందిస్తున్నారు. మౌలిక సదుపాయాలపై భారీగా మూలధన వ్యయం పెంచి, హై-స్పీడ్ కారిడార్లు, డేటా సెంటర్లకు పన్ను రాయితీలు ప్రకటించారు. ఐటీ, ఏఐ రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి.
రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్ల కేటాయింపులు చేసి, అందులో 75 శాతం స్వదేశీ కొనుగోళ్లకు కేటాయించడం ఆత్మనిర్భర భారత్ దిశగా కీలక అడుగుగా నిలిచింది. రక్షణ ఎగుమతులు రూ.23,000 కోట్లకు పైగా చేరడం దేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు.
జీఎస్‌టీ సరళీకరణ, కార్మిక సంస్కరణలు, డిజిటల్ పేమెంట్స్ విస్తరణ వంటి చర్యలతో భారత్ సమగ్ర అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని ప్రధాని తెలిపారు. 2026 బడ్జెట్ 2047 లక్ష్యాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
