class="wp-singular post-template-default single single-post postid-1006 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్లు ఒకటి. కండరాల బలానికి, శరీర నిర్మాణానికి ఇవి అత్యంత కీలకం. అయితే సరైన మోతాదులో ప్రోటీన్లు తీసుకోకపోతే కండరాలు బలహీనపడటమే కాకుండా వాటి పెరుగుదల కూడా మందగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా జరిగిన ఒక సర్వే ప్రకారం భారతీయుల్లో ప్రోటీన్ లోపం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది.

దక్షిణ కొరియాకు చెందిన ఇప్పోస్–ఇన్ బాడీ సంస్థ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, పాట్నా వంటి ఎనిమిది ప్రధాన నగరాల్లో 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులపై అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 68 శాతం మంది ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కొంటున్నట్లు తేలింది.

హైదరాబాద్‌లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని సర్వే వెల్లడించింది. అక్కడ 75 శాతం మందికి పైగా ప్రోటీన్ లోపం ఉన్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో విడుదల చేసిన మరో నివేదిక ప్రకారం దేశంలో చాలా మందికి రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో కూడా తెలియదని వెల్లడైంది.

అందులో 93 శాతం మందికి రోజువారీ ప్రోటీన్ అవసరంపై అవగాహన లేకపోవడం గమనార్హం. మరోవైపు దేశంలో సుమారు 71 శాతం మందికి కండరాల ఆరోగ్యం సరిగా లేదని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రోటీన్ లోపమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

కండరాల బలానికి ప్రోటీన్లు కీలకం

శరీరానికి సరిపడా ప్రోటీన్ రోజువారీ ఆహారంలో ఉండటం చాలా ముఖ్యం. కానీ భారతీయుల్లో 30 నుంచి 40 శాతం మంది అవసరమైనంత ప్రోటీన్ తీసుకోవడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో చాలామంది బరువు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యకరమైన కండరాలు పెరగడం లేదు.

ప్రస్తుతం పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో చిన్నపిల్లలకు పప్పులతో తయారు చేసే ఇంటి ఆహారం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్స్, చిప్స్, చాక్లెట్లు వంటి పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల పిల్లలకు సరిపడా ప్రోటీన్లు అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో పిల్లల్లో ఎదుగుదల కూడా మందగిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రోటీన్ కోసం తీసుకోవాల్సిన ఆహారం

ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతిరోజూ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే పప్పులు, ధాన్యాలు, పాలు వంటి ఆహారం ఇవ్వడం అవసరం. ఆరు నెలల తర్వాత ఇంట్లో తయారుచేసిన పప్పు పదార్థాలు ఇవ్వడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

అలాగే ఏడో నెల నుంచి గుడ్డు పచ్చసొన ఇవ్వడం ప్రారంభించి, క్రమంగా మొత్తం గుడ్డు తినేలా అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లలు రోజుకు రెండు సార్లు పాలు తాగడం, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక గుడ్డు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మాంసాహారం తీసుకునేవారు చేపలు, చికెన్, గుడ్లు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అయితే ఎక్కువ మసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా ఉడికించిన లేదా తక్కువ నూనెతో తయారుచేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer : ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన సలహాల కోసం వైద్యులు లేదా న్యూట్రిషనిస్టులను సంప్రదించడం మంచిది.