Reading Time: 2 minutes

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవల ఇరాన్ ఈ జలసంధిపై నియంత్రణ పెంచడంతో అంతర్జాతీయ చమురు రవాణా దాదాపు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన చమురు ట్యాంకర్లకు ఇప్పుడు ఇరాన్ అనుమతి ఇవ్వడం ముఖ్య పరిణామంగా మారింది.

దౌత్య చర్చల తర్వాత భారత్‌కు చెందిన చమురు ట్యాంకర్లకు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ దాటిన తొలి నౌకగా భారత ట్యాంకర్ నిలిచింది. లైబీరియన్ జెండా కలిగిన షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్ అనే చమురు ట్యాంకర్ ముంబై ఓడరేవుకు చేరుకున్నట్లు ముంబై పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.

ఈ ట్యాంకర్ సౌదీ అరేబియాలోని రాస్ తనురా పోర్ట్ నుంచి ముడి చమురు లోడ్ తీసుకుని భారత్‌కు బయలుదేరింది. ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత ఇరుకైన హార్ముజ్ జలసంధిని దాటి ముంబైకు చేరుకుందని అధికారులు తెలిపారు.

భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరియు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ అనుమతి లభించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యల తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారుడైన భారత్ ఈ పరిస్థితిలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇక షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారత జెండా నౌకలు పనిచేస్తున్నాయి. వీటిలో 24 నౌకలు, 677 మంది భారతీయ నావికులు హార్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉండగా, నాలుగు నౌకలు మరియు 101 మంది నావికులు తూర్పు భాగంలో ఉన్నట్లు తెలిపింది. భారతీయ నౌకలు మరియు నావికుల భద్రతపై ప్రభుత్వం నిశితంగా నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

అంతకుముందు కాండ్లా పోర్టుకు వస్తున్న థాయ్ నౌకపై హార్ముజ్ జలసంధిలో దాడి జరిగిన ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు హార్ముజ్ ప్రాంతంలో 16 నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం.