class="wp-singular post-template-default single single-post postid-1042 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 13 ఏళ్లలోపు పిల్లల కోసం “Parent Managed Accounts” అనే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల వాట్సాప్ వినియోగాన్ని నేరుగా పర్యవేక్షించగలరు.

ఈ కొత్త వ్యవస్థలో పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏ గ్రూపుల్లో చేరుతున్నారు, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో వంటి అంశాలను తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. దీంతో పిల్లల ఆన్‌లైన్ భద్రతను మరింత మెరుగ్గా పర్యవేక్షించేందుకు అవకాశం కలుగుతుంది.

తల్లిదండ్రులకు ప్రత్యేక నియంత్రణలు

ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులకు పలు నియంత్రణలు లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు ఎవరు మెసేజ్ పంపాలి, ఏ గ్రూపుల్లో చేరాలి అనే విషయాలను తల్లిదండ్రులే నిర్ణయించగలరు. అదనంగా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ రిక్వెస్టులను కూడా పరిశీలించవచ్చు.

అలాగే పిల్లల ప్రైవసీ సెట్టింగ్స్‌ను తల్లిదండ్రులు లాక్ చేయగలరు. ఈ సెట్టింగ్స్‌ను పిల్లలు స్వయంగా మార్చలేరు. మార్పులు చేయాలంటే తల్లిదండ్రులు సెట్ చేసిన ప్రత్యేక PIN కోడ్ అవసరం అవుతుంది. అయితే ఈ ఫీచర్‌ను ఒక్కసారిగా అందరికీ ఇవ్వకుండా ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

సోషల్ మీడియా వినియోగంపై పెరుగుతున్న చర్చ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై పెద్ద చర్చ జరుగుతోంది. భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు యజమానిగా ఉన్న మెటా కంపెనీ, పూర్తిగా నిషేధం విధించడంకన్నా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Parent Managed Account ఎలా సెట్ చేయాలి?

పిల్లల ఫోన్‌లో ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత భాషను ఎంపిక చేసి Agree and Continue పై ట్యాప్ చేయాలి.

తర్వాత More Options లో కనిపించే Create a Parent-Managed Account అనే ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. అక్కడ పిల్లల ఫోన్ నంబర్ నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. తరువాత పిల్లల జన్మతేదీ నమోదు చేసి వయస్సును నిర్ధారించాలి.

అంతకుముందు తల్లిదండ్రుల అకౌంట్‌తో ఈ అకౌంట్‌ను లింక్ చేయాలి. ఇందుకోసం పిల్లల ఫోన్‌లో కనిపించే QR కోడ్‌ను తల్లిదండ్రుల డివైస్‌తో స్కాన్ చేయాలి. తరువాత తల్లిదండ్రులు తమ గుర్తింపును ధృవీకరించి 6 అంకెల Parent PIN ను సెట్ చేయాలి.

ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత పిల్లలు తమ పేరు, ప్రొఫైల్ ఫోటో వంటివి సెట్ చేసుకోవచ్చు. అయితే అకౌంట్‌కు సంబంధించిన ముఖ్యమైన నియంత్రణలు అన్నీ తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటాయి.