class="wp-singular post-template-default single single-post postid-381 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

ఇరాన్‌లో గత రెండు వారాలుగా కొనసాగుతున్న భారీ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది అజాద్ తీవ్ర హెచ్చరిక జారీ చేస్తూ, నిరసనల్లో పాల్గొనే వారిని ‘దేవుని శత్రువులు (మొహారెబ్)’గా పరిగణిస్తామని తెలిపారు.

ఈ నేరానికి మరణశిక్ష వర్తిస్తుందని స్పష్టం చేశారు. నిరసనల్లో పాల్గొన్నవారితో పాటు అల్లరిమూకలకు సహకరించినవారిపైనా అదే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ చట్టంలోని ఆర్టికల్ 186 ప్రకారం, ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా ఆయుధ పోరాటానికి మద్దతిచ్చినవారిని మొహారెబ్‌గా పరిగణిస్తారు.

ఇరాన్ శిక్షా నియమావళి ఆర్టికల్ 190 ప్రకారం మొహారెబ్ నేరానికి మరణశిక్ష, ఉరి, అవయవాల తొలగింపు, శాశ్వత అంతర్గత నిర్బంధం వంటి కఠిన శిక్షలు ఉన్నాయి. అమెరికా హెచ్చరికలను లెక్కచేయకుండా టెహ్రాన్ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది.

నిరసనల్లో ఇప్పటివరకు సుమారు 65 మంది మరణించగా, 2,300 మందికిపైగా అరెస్టయ్యారని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇంటర్నెట్, సెల్‌ఫోన్ సేవలు నిలిపివేశారు.

ఇదిలా ఉండగా, ప్రవాస యువరాజు రెజా పహ్లవి జనవరి 10, 11 తేదీల్లో మరోసారి నిరసనలకు పిలుపునిచ్చారు. కరెన్సీ పతనం, ఆర్థిక సంక్షోభం కారణంగా మొదలైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనగా మారి, ఇరాన్‌లో పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతోంది.