class="wp-singular post-template-default single single-post postid-557 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

హైదరాబాద్ కోఠిలోని State Bank of India (ఎస్‌బీఐ) ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన నగరంలో కలకలం రేపింది. ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలతో దుండగులు పరారయ్యారు. అయితే ఈ కేసులో నిందితుల ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అయినప్పటికీ వారు పోలీసులకు చిక్కకుండా పక్కా ప్లాన్‌తో తప్పించుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రెండు రోజులుగా పలు ఆటోలు మారుతూ నగరంలోనే తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు వెళ్లి లోపలికి ప్రవేశించకుండా మళ్లీ ఆటోలో చాంద్రాయణగుట్ట వైపు వెళ్లినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే రైల్లో ప్రయాణిస్తే పట్టుబడుతామనే ఉద్దేశంతో ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఒక రోజు గడిచిన తర్వాత నగరం దాటి నార్త్ స్టేట్స్ వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనలో కేరళకు చెందిన వ్యాపారి రిన్షాద్ శనివారం ఉదయం డబ్బులు డిపాజిట్ చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ ఆయన కాలి లోపలికి దూసుకెళ్లగా, మరో బుల్లెట్ మిస్ ఫైర్ అయింది. ప్రస్తుతం రిన్షాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై Sultan Bazar Police కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.