class="wp-singular post-template-default single single-post postid-582 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే స్టార్ అంటే అదే మహేశ్ బాబు. కెరీర్ ప్రారంభ దశ నుంచే డూప్‌లను వాడకుండానే ప్రమాదకరమైన సన్నివేశాలు చేయడంలో ఆయన ముందుంటారు. అందుకు ఉదాహరణగా టక్కరి దొంగ సినిమాలో కదులుతున్న రైలు కింద చేసిన రిస్కీ ఫైట్ సీన్ ఇప్పటికీ ఫ్యాన్స్‌కు గుర్తుండిపోయింది.

ప్రస్తుతం మహేశ్ బాబు, దర్శకధీరుడు S. S. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేశ్ చేస్తున్న మేకోవర్, పడుతున్న శ్రమ గురించి తాజాగా ఆయన హాలీవుడ్ మీడియాతో పంచుకున్న విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఏడాది కాలంగా శ్రమిస్తున్న మహేశ్

ఈ సినిమాలోని తన పాత్ర కోసం దాదాపు ఒక సంవత్సరం పాటు కఠినమైన శ్రమ చేస్తున్నానని మహేశ్ వెల్లడించారు.
“ఇది కేవలం నటన పరమైన మార్పు మాత్రమే కాదు. నా బాడీ షేప్, బాడీ లాంగ్వేజ్ అన్నీ పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో నా నడక, నిలబడే తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది” అని ఆయన తెలిపారు.

శ్రీరాముడి గాంభీర్యం కోసం ప్రత్యేక శిక్షణ

తన పాత్రలో గాంభీర్యం, పర్ఫెక్షన్ తీసుకురావడానికి మహేశ్ బాబు కలరిపయట్టు అనే యుద్ధ విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని చెప్పారు.
“శ్రీరాముడి నడకలో ఉండే గంభీరత, నిలబడే తీరులో ఉండే ఆ పర్ఫెక్షన్‌ను తెరపై చూపించాలనే లక్ష్యంతో ఈ ట్రైనింగ్ తీసుకున్నాను. నా నడక, నా పోష్చర్… ప్రతిదీ మారిపోయింది” అని వివరించారు.

ఒక్క షాట్ చూసి శ్రమ మర్చిపోయా…

ఆరు నెలల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత షూటింగ్‌కి వచ్చి, తెరపై ఆ ఒక్క షాట్ చూసినప్పుడు తాను పడ్డ కష్టం మొత్తం మర్చిపోయానని మహేశ్ భావోద్వేగంగా చెప్పారు.
“ఆ ఒక్క ఫ్రేమ్ కోసం నేను పడిన కష్టం మాటల్లో చెప్పలేను” అని అన్నారు.

ఒక్క ఫ్రేమ్ కోసం ఆరు నెలల సమయం వెచ్చించారంటే, ఈ సినిమాపై రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వారణాసి సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.