దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ఇకపై చెక్ పెట్టి, పూర్తిగా పారదర్శకంగా, సమయపాలనతో కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నిబంధనలను రూపొందించారు. ఇవి గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం మెట్రో నగరాల్లో దరఖాస్తు చేసిన మూడ్రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. మున్సిపాలిటీ పరిధిలో గరిష్టంగా ఏడు రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోపు కొత్త కనెక్షన్ జారీ చేయాల్సిందే. కొండ ప్రాంతాలు లేదా భౌగోళిక ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో మాత్రం 30 రోజుల గడువు ఇచ్చారు. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో గరిష్టంగా 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని నిబంధనల్లో స్పష్టం చేశారు.
ఈ మార్పుల నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటివరకు దూరాన్ని బట్టి వసూలు చేసిన ఛార్జీలకు బదులుగా ఇకపై ఫిక్స్డ్ ఛార్జీలు అమలు చేయనున్నారు. 1 కిలోవాట్ కనెక్షన్‌కు రూ.500, 1 నుంచి 5 కిలోవాట్ల వరకు రూ.3,500 వరకు వసూలు చేయనున్నారు.
కొత్త కనెక్షన్ల కోసం ఇకపై కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పూర్తిగా ఆన్లైన్ విధానం అమలు చేస్తున్నారు. సంబంధిత డిస్కంల వెబ్సైట్లో దరఖాస్తు చేసి, ఆధార్, ఆస్థి పత్రాలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దరఖాస్తు స్థితిని ఆన్లైన్లోనే ట్రాక్ చేయవచ్చు. జాప్యం జరిగితే ఆటోమేటిక్‌గా ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లే విధంగా వ్యవస్థ రూపొందించారు.
అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వ్యక్తిగత కనెక్షన్లు లేదా సింగిల్ పాయింట్ కనెక్షన్ ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కొత్త కనెక్షన్‌కు స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేశారు. 10 కిలోవాట్ల వరకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేవారికి టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ అవసరం లేకుండా సడలింపు ఇచ్చారు. ఈ సంస్కరణలతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…





