class="wp-singular post-template-default single single-post postid-650 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49, 10, 58, 59, 60 డివిజన్లలో నిర్వహించిన భారీ రోడ్‌షోలు, బహిరంగ సభలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, కొత్తగూడెం అభివృద్ధిలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర చిరస్మరణీయమని, బడుగు-బలహీన వర్గాల గొంతుకగా సీపీఐ ఎల్లప్పుడూ నిలబడుతుందని స్పష్టం చేశారు. బస్తీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారం నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు ప్రతి అంశంపై పోరాడుతామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పాలనలో పారదర్శకత ఉండాలంటే ఎర్రజెండా అభ్యర్థుల విజయం అనివార్యమని పేర్కొన్నారు.

గత రెండేళ్లలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని, కొత్తగూడెంను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెట్టేందుకు ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా నిబద్ధత గల సీపీఐ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా అహంకారులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టులు కాదని, సామాన్యుడి ముంగిటకు సంక్షేమ ఫలాలు చేరడమే నిజమైన అభివృద్ధి అని ఆయన ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా నాయకులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, ఎస్‌కే ఫహీమ్‌తో పాటు అభ్యర్థులు మూడ్ గణేష్, సహేరా మహమ్మద్, బోయిన విజయ్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ సల్మా, కొచ్చెర్ల రాకేష్ కాంత్, ఇమ్రాన్ మహమ్మద్, బేత అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాయకులు యూసుఫ్, తుమ్మ నర్సయ్య, పల్నాటి ప్రశాంత్, అస్మత్, జడల ప్రకాష్, అజీజ్, జక్కుల రాములు, కుమారి హన్మంతరావు తదితరులు హాజరయ్యారు.