Reading Time: 2 minutes

ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి తన చర్యల ద్వారా నిరూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిరుపేదల పక్షాన నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

వైరా పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద దాదాపు నాలుగు దశాబ్దాలుగా రోడ్డు పక్కన చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న సుమారు 100 కుటుంబాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపరిచిందని తెలిపారు. దుకాణాలను పునర్నిర్మాణం చేస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం అన్ని షాపులను కూల్చివేసి, ఆయా కుటుంబాలను జీవనోపాధి లేకుండా రోడ్డున పడేసిందని పేర్కొన్నారు.

జీవనోపాధి కోల్పోయిన ఆ కుటుంబాలు ఏళ్ల తరబడి గత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని, అప్పటి పాలకులు ఏమాత్రం కనికరం చూపలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం వైరా నుంచి మధిర వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి వాహనం వద్దకు బాధిత కుటుంబాల ప్రతినిధులు చేరుకుని తమ ఆవేదనను, బాధను వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వెంట ఉన్న స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ నిరుపేదలకు జరిగిన అన్యాయాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

వైరా బస్టాండ్ పరిసర ప్రాంతంలో పేదలకు మళ్లీ దుకాణాలు నిర్మించేందుకు సుమారు ఎనిమిది కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రికి వివరించారు. జీవనోపాధి కోల్పోయి నెట్టుడు బండ్లపై వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న వారి పరిస్థితిని చూసిన ఉప ముఖ్యమంత్రి, బాధితులందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.

దుకాణాల నిర్మాణానికి సంబంధించి పూర్తి అంచనాలతో కూడిన నివేదికను వెంటనే పంపాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. అంచనాల నివేదికలు అందగానే అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.