class="wp-singular post-template-default single single-post postid-670 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

యూట్యూబ్ ఏఐ ఆధారిత ఆటో-డబ్బింగ్ ఫీచర్‌ను మరింత విస్తరించింది. ఇప్పటివరకు పరిమిత ఛానెళ్లకే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం, ఇప్పుడు అన్ని ఛానెళ్లకు వర్తిస్తుంది.

ఈ ఫీచర్ ద్వారా వీడియోలను ఆటోమేటిక్‌గా 27 భాషల్లో డబ్ చేసి వీక్షించవచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను భాషా అడ్డంకులు లేకుండా చూసే అవకాశం లభిస్తోంది. 2023లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సదుపాయాన్ని, 2024లో నాలెడ్జ్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోలకు విస్తరించారు.

తాజాగా మ్యూజిక్ వీడియోలు మినహా దాదాపు అన్ని రకాల వీడియోలకు ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌కు మంచి స్పందన లభిస్తున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. డిసెంబర్ 2025లో రోజుకు సగటున 60 లక్షల మందికిపైగా వీక్షకులు కనీసం 10 నిమిషాల పాటు ఆటో-డబ్డ్ కంటెంట్‌ను చూసినట్లు తెలిపింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా ‘ఎక్స్‌ప్రెసివ్ స్పీచ్’ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఇది డబ్ చేసిన వాయిస్‌ను మరింత సహజంగా, అసలు స్పీకర్ హావభావాలు, టోన్‌కు దగ్గరగా ఉండేలా చేస్తుంది.

ప్రస్తుతం ఇది హిందీ, ఇంగ్లీష్, స్పానిష్‌తో పాటు ఎనిమిది భాషల్లో అందుబాటులో ఉంది. అలాగే లిప్ సింక్ ఫీచర్‌పై ప్రయోగాలు చేస్తుండగా, వీక్షకులు తమకు నచ్చిన భాషను ఎంచుకునేందుకు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ సెట్టింగ్‌ను కూడా జోడించారు. క్రియేటర్లు కోరుకుంటే ఈ ఆటో-డబ్బింగ్‌ను ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో క్రియేటర్లకు గ్లోబల్ ఆడియన్స్‌ను చేరుకునే అవకాశం మరింత పెరిగింది.