class="wp-singular post-template-default single single-post postid-673 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

తమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుందన్న కోపంతో యువతి తల్లిదండ్రులు అల్లుడి ఇంటికి నిప్పుపెట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈ దారుణానికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం భీమారం మండలం దాంపూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు జంగపెల్లి సులేమాన్ అదే గ్రామంలో నివసించే బీసీ యువతిని ప్రేమించాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇటీవల కరీంనగర్‌లో వివాహం చేసుకున్నారు.

ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇంటిపై పోసి నిప్పంటించారు. దీంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనపై యువకుడి తండ్రి ఫిర్యాదు చేయగా, సుమారు రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రి, సోదరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.