class="wp-singular post-template-default single single-post postid-712 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం పోలీస్ స్టేషన్‌లో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి సంబంధించిన కేసులో ముద్దాయి నుంచి లంచం డిమాండ్ చేసిన ఎస్సై బి. వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబులను ఏసీబీ అధికారులు ట్రాప్ ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.

పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిపై అక్రమ సంబంధం ఆరోపణలతో కేసు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్సై వెంకటేష్, కేసును సర్దుబాటు చేయాలంటే రూ.20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు ఇవ్వకపోతే కఠిన కేసు నమోదు చేస్తామని బెదిరించడంతో పాటు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు.

లంచం డిమాండ్‌పై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ట్రాప్‌కు సిద్ధమైంది. ముందుగా రసాయన పౌడర్ పూసిన నోట్లను బాధితుడికి ఇచ్చారు. గంగవరం పోలీస్ స్టేషన్ సమీపంలో కానిస్టేబుల్ వీరబాబుకు రూ.15,000 అందజేసిన వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పరీక్షల్లో రసాయన ఆనవాళ్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు.

విచారణలో ఎస్సై సూచన మేరకు డబ్బు తీసుకున్నట్లు వెల్లడించడంతో వెంకటేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. చట్టాన్ని అమలు చేయాల్సినవారే లంచం కేసులో చిక్కుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.