Reading Time: < 1 minute

శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు, ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. నిపుణుల ప్రకారం ఒక వయోజనుడికి రోజుకు కనీసం 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. సాధారణంగా అర టీస్పూన్ అయోడైజ్డ్ ఉప్పు ద్వారా ఈ అవసరం తీరుతుంది. అయితే ఇటీవల పింక్ సాల్ట్ లేదా సీ సాల్ట్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

పింక్ సాల్ట్‌లో ఇనుము వంటి ఖనిజాలు ఉన్నప్పటికీ, అయోడిన్ సహజంగా ఉండదు. దీన్ని ఎక్కువకాలం వాడితే శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి గాయిటర్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు అయోడిన్ లోపానికి గురైతే పిండం మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల కూడా దెబ్బతింటుంది.

అయోడిన్ లోపాన్ని నివారించేందుకు చేపలు, పాలు, పెరుగు వంటి ఆహారాలు తీసుకోవచ్చు. అయితే సులభమైన మార్గం అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్ వాడడమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొత్త ఆహార అలవాట్లు పాటించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.