Reading Time: < 1 minute

ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై గురుకుల సొసైటీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా సొసైటీ పరిధిలో ఉన్న 264 స్కూళ్లు, ఇంటర్ మరియు డిగ్రీ కాలేజీల్లో సుమారు లక్షన్నర మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఫుడ్ పాయిజనింగ్, పాము, తేలు కాట్లు వంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి పరిష్కారంగా సొసైటీ హెడ్ ఆఫీస్‌లో హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంలో అదనపు సెక్రటరీతో పాటు ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు హెల్త్ సూపర్వైజర్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు సేవలందిస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రతి గురుకుల సంస్థ నుంచి విద్యార్థుల ఆరోగ్య వివరాలను రోజూ ఉదయం 6 గంటలలోపు ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తున్నారు. ఏ విద్యార్థి అనారోగ్యానికి గురైనా కారణం, చికిత్స, ప్రస్తుత పరిస్థితి వంటి వివరాలను నమోదు చేసి, అవసరమైతే జిల్లా లేదా హైదరాబాద్‌కు తరలించేందుకు సూచనలు ఇస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఉన్నతాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్యసేవలు అందిస్తున్నారు.