class="wp-singular post-template-default single single-post postid-782 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రతాప్‌సింగారం న్యూవెంచర్‌లో నివసిస్తున్న దాసరాజుల పద్మ (65), దాసరాజుల ప్రకాష్ (66) దంపతుల మధ్య ఆదివారం జరిగిన చిన్న గొడవ అనూహ్య పరిణామానికి దారితీసింది. విశ్రాంత ఉద్యోగిగా ఉన్న ప్రకాష్, శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇంట్లో చికెన్ కూర వండాలని భార్యను కోరినట్లు సమాచారం. అయితే పండుగ రోజు కావడంతో మాంసాహారం వండబోనని పద్మ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

గొడవ తర్వాత పద్మ ఇంటి నుంచి బయటకు వెళ్లి కొంతసేపటి తరువాత తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు తెరిచిన ఆమెకు భర్త ప్రకాష్ సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే ఇరుగుపొరుగు వారి సహాయంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం పెద్దల్లుడు అంచ మహేష్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని పద్మ వివరించినట్లు తెలుస్తోంది. క్షణికావేశంలో ఈ చర్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాష్ సోమవారం ఉదయం మృతి చెందాడు. అల్లుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.